మేఘాలనూ..వానలనూ..మేఘాలనూ..మాయా మోహితాలనూ..మేఘాలనూ సప్తవర్ణ సౌగంధిక ఛాయలనూ..అన్నింటినీ .. అన్నింటినీ ఏక కాలంలో ఆహ్వానించాలి..నెర్రెలు విచ్చిన నేలలు మౌనాన్ని ఆశ్రయిస్తే..కన్నీటి తడుల చెంత బీడు ఏ బీజాక్షర సంపదను..నాదాలను ఇముడ్చుకోగలదని ? ఈ మట్టి పోగుల చెంత.. కాసింత ఆశల సాగు సాధ్యం కాని పని..ఒక వైరాగ్య సిద్ధిని పొందాక.. జీవితావరణంలో చీకటి కావ్యం అత్యంత ప్రయోజనకారి..ఆ దుఃఖ సాగర తీరాల నిర్మాణంలో నిర్వాణ గతిని ప్రేమించాలి ..బూడిదలో వెలిగే జ్ఞానాన్ని గుర్తించాలి .. బండ బుద్ధికి తోచిన రీతిన అయినా ఈ పచ్చందనాల పరిరక్షణకు సాయం అందించాలి ఎవరు చేస్తారు…?
ప్రకృతిపై ప్రేమ..ఈ నేలపై ఎడతెగని ప్రేమ..అసలు పంచభూతాల పరిరక్షణే ధ్యేయంగా ఈ మనుషులు కదులుతున్నారు చూడు అది కదా! నమోదు కావాల్సిన సందర్భం..అవునా! ఇది నిజమేనా!మీ/మీ దరిద్రగొట్టు జీవితాలను ఫణం గా పెట్టి ప్రకృతి పరిరక్షణకు కదలాడుతున్నారా..ఎవడ్రా చెప్పాడు సమస్త లోకం ఒక్కటిగా గొంతెత్తే రోజు తప్పక వస్తుంది అని! ఏదీ కాదు..ఈ సారే కాదు ముందున్న కాలం కూడా ఈ కరువు, ఈ కాటకం,ఈ కంటకం అన్నీ/అన్నీ బాధ్యతగా మనం మోయాల్సిన పరిణామాలే కాక తప్పువు. నేతలూ/ప్రజలూ అంతా ముసుగు దొంగలు లేదు లేదు వీరే,వీరే ప్రకృతి ప్రేమికులు..వనాన్ని నరికి జనానికో మేలు చేస్తున్న ప్రబుద్ధులు దగ్గర మనం ఏమీ మాట్లాడరాదు. అవును! ఈ సారి వాన రాదు..అవును ఈ సారి కరువుని ఫలంగా పొంది జీవితాన్ని చిచ్చుల మార్గం నుంచి తప్పించుకునే ప్రయత్నం ఒకటి ఎలానో ఒకలా చేయాలి. అవును ప్రకృతి దారికి ప్రత్యామ్నాయ శక్తి అన్నది లేదు కదా ఉంటే బాగుండు.
చెప్పానుగా వినిమయం కీడును మిగులుస్తోంది..అని! అవసరం దిగజారుడుతనాన్ని అలవరుస్తుంది. మీరు జారుడు మెట్లపై నుంచి హాయిగా జారిపోండి ఏం కాదు మీకు పాకుడు రాళ్లే కదా ఇష్టం వాటి పై నుంచి జారిపోండి..ఏం కాదు మీ రు చచ్చినా నేను చచ్చినా ఈ భారతావని కోల్పోయిందేమీ ఉండదు..కొన్ని క ట్టెల వెలుగు దగ్గర లోకం మరింత దేదీప్యం అవుతుంది..వెలిసిన రంగుల నివాళిని ఆస్వాదిస్తే హాయిగా అంతిమ కాలం చెంత ..కొన్ని నిట్టూర్పులూ కొన్ని అ సంబద్ధ పొగడ్తలూ తోడుగా వస్తాయి. వాటితోనే జీవిత చరమాకం అంతిమ ప్ర యాణం చేయాలి.బూడిదలో వెలిగే జ్ఞానం ఏదయినా ఉంటే అది ముందు తరం అందుకోవాలి సాధ్యం అవునో,కాదో ఎవరికి వారో తేల్చుకోవాలి.. ఈ గాలీ / ఈ నే లా అన్నింటినీ విషతుల్యం చేసిన హక్కుని పొందిన మారాజులంతా ఈ దరిద్ర గొట్టు జీవితం ప్రసాదించిన మారాజులంతా చల్లంగా ఉండాలె.
నైరుతి పౌరస్మృతిని మరిచినట్టుంది..అన్నాడొకడు..
అవున్రా విధ్వంసాన్నీ,విలయాన్నీ ప్రేమించడమే తప్పక చేయాలి. చావులను గుట్టలుగా పోగుబడిన శవాలనూ ప్రేమించాలి.. మంది చేసిన తప్పిదాల పుణ్య ఫలం మీరూ,నేనూ తప్పక అందుకోవాలి..ఒరేయ్ ఆ పొగ గొట్టం విదిల్చే విషాన్ని నీవు మింగి వాడి దగ్గర కొలువు పేరిట ఉన్నావు కదా..! అదే జీవితం..తప్పదు అదే కర్మ ఫలం…విషాన్ని మింగి జీవితం ఇచ్చిన వాడికి కృతజ్ఞత ప్రకటించడమే జీవితం..కనుక మాకు రాక్షస రసాయనాలు కావాలి..మాకు ఆకలి కేకలే కాదు ఉన్నంతలో విషాన్ని మింగి అయినాబతికే అవకాశాలనే ప్రభువు ప్రసాదించాలి. కాల కూటాన్నీ సంబంధిత కూటమిని దగ్గర చేసుకుని మచ్చిక చేసుకుని హాయిగా శవాలను ఓ చోట చేర్చి ఇదిరా చరిత్ర గతి అని చెప్పడం ఇప్పుడందరికీ చాలా ఇష్టమయిన పని..ఎందుకంటే ఏం జరిగినా జనం నుంచి ప్రతిఘటన ఉండదు కదా..! కనుకనే ఆ శవాల ఊరేగింపులో జనులంతా ఒక్కటికండి.. హక్కుల సంఘాలూ గట్టిగా అరవండి ఏం కాదు..మీరు చేసిందేం లేదు..మీరు చేయాల్సిందీ ఏమీ లేదు.
సహేతుక స్థితి అన్నది లేదిక్కడ
అడ్డదిడ్డంగా తోచినవన్నీ తెగ రాజ్యాలేలుతాయ్
బండ రాళ్లకు వాటి పోగులకూ ఉన్న విలువ
శిఖరానికి లేదు.. అవును! గులక రాళ్ల సవ్వడే సమస్త విజ్ఞాన సర్వసానికీ సంకేతంగా భావిస్తున్న మనుషులున్నాక ఆ తేలిక పాటి శబ్దాలే గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నాయని ఓ అపోహ..పైన నీలావరణాన కూడా గొడ్డు మోతుమే ఘాల ఛాయలు చూసి అక్కడే మీరు ఊహించిన గొప్ప వర్ణాల ఛాయ ఉందని భ్రమించండి.
రాదిక ఏ వానా..పోదిక ఏ చీకటీ..మనుషులకింత అజ్ఞానం చుట్టూ ఉన్న ప్రకృతిపై బాధ్యత పట్టని వైనం ఉన్నాక గాలులు అనుకూలిస్తాయని నేలతల్లి పులకిస్తుందని ఇలాంటి దరిద్రగొట్టు వాక్యాలు రాయను గాక రాయను..అసలీ నిరాశ చావు కన్నా మేలుగానే ఉంది. అవును ! అన్నీ మేలే చేస్తాయి.చెప్పాను నిర్వేద గతి కూడా మేలే చేస్తుంది. ప్రియ జనులారా! ప్రత్యామ్నాయ ప్రపంచ నిర్మాణం ఒకటి చేసుకోండి..మీ ఇల్లు,మీ జాగా, మీ పెరడు ఇవన్నీ వదిలి ఏదో కొ త్త దారి వెతుక్కోండి..చూడండి చంద్రుడి దగ్గర జాగా ఉందేమో!
జీవ గొంతుకలన్నీ నినదించే సందర్భాలను నమోదితం చేయాలి.చేసి ఏం చే యాలి.. జీవ గొంతుకలన్నీ శబ్దించే నినాదాలకో ఆచరణరావాలి..అవును వ స్తుందా..అవేవీ ఉండవు..గాలులకు మొండితనం వచ్చేసింది.మీరిక ఎండకాలం కొనసాగింపును చూడాలి. వాన చినుకుల రాక అన్నది ఇకలేదని తేలిపోయాక..ఒక అదృశ్యమాన సందర్భం తప్పక నమోదు కావాలిక. దేనిని దృశ్యీకరించాలి ఎడారులనూ, బీడు భూములనూ,శవాలనూ వీటినేనా మనం చిత్రీకరించాలి. ఈ కాలాన్నీ..ఈ శాపాన్నీ..మీరో,నేనో తప్పక భరించాలి. మనుషులకు కాస్త బాధ్యత కూడా లేనప్పుడు వానలను ఆహ్వానించే అర్హత కూడా లేదు. అవును! చినుకు జాడ రావడం వింత.. నమోదు కావడం ఓ పెద్ద పండుగ.. కానీ ఆ పండుగ సంతోషం ఇప్పట్లో లేనట్లే!
ఎక్కడెక్కడో పక్షులు ఎక్కడెక్కెడో గూటి గువ్వలు వచ్చి వాలిపోయాక ఈ ప్రాం తం కిలకిలల భాషలో సందడిగా మారింది. ఎక్కడెక్కడో మౌనం ఎక్కడెక్కడో వి షాదం ఎక్కడికక్కడే దుఃఖం ఇలా వస్తున్న లేదా పేరుకుపోయిన సందర్భాన ఈ ప్రాంతం విషాదాలను అలుముకుంది. వానల్లేవని ఏడుస్తున్న జనాలకు కడివెడు నీరు ఆకాశం ఇవ్వక ఊరిస్తోంది చూడండి అది విషాదం.
ఎండలు వద్దు బాబోయ్ అని అరుస్తున్నా ఆ నైరుతి ముఖం చాటేయడం చూస్తున్నాం చూడండి అది విషాదం. కాలం ప్రతీకార చర్యలకు సంకేతికగా మారిపోయాక ఎల్లకాలం పాటించాల్సిన ప్రకృతి ధర్మం గతి తప్పి చాలా కాలం అయ్యింది. మనుషులే అంతా .. మనుషులే ఏ బాధ్యతా పట్టని మనుషుల దగ్గర పీడిత వ్యవస్థల గెలుపుని తప్పక చూడాలి. అవును ! కాలం ఇప్పుడిక పీడిత వ్యవస్థకు సంకేతం. సంబంధిత ఆదేశాలను తప్పక పాటించాలి.
అందుకనో / ఎందుకనో
జీవామృత ధారను ఒడిసిపట్టుకోండి
మీ ప్రయోగ శాలల్లో మేధోమథనం చేశాక
కొత్త మబ్బులనూ కొత్త ఆకాశాల సృష్టినీ తయారు చేయడం నేర్చుకోండి..మీరు చేసే నిర్మాణమో విధ్వంసమో ఏదో ఒకటి త్వరగా తేలిపోవాలి.. మళ్లీ మనుషులు ఆకలి చావులకు సిద్ధంగా ఉండే రోజు ఒకటి అదిగో అతి త్వరలో.. ఒరేయ్ చావండ్రా..మీ పాపాలకూ.. మీ..మీ.. స్వయంకృతాలకూ.. చావులో కూడా శాంతి లభిస్తుందా..? జరగని పని! అశాంతులారా..మీకో అవకాశం ఉంది. వినియోగించుకోండి. పరివర్తన కూడళ్ల దగ్గర మీరంతా ఏకంకండి.. ప్రకృతికి క్షమాపణ చెప్పి ముందరి స్థితిని నిర్మించే ప్రయత్నం ఒకటి చేయండి..నివాళించు హృదితో చేస్తున్నానొక విన్నపం..ఒక ఘోష/ ఒక శ్లేష / ఈ కూడలిలో..కలదు వెతకవోయ్..బూడిద వెలిగించు..జ్ఞానం ఇదే..తెల్చుకో..నేర్చుకో..
– రత్నకిశోర్ శంభుమహంతి