ప్రస్తుతం తెలంగాణలో దళిత నాయకులకు, దళిత ఐఏఎస్, ఐపీఎస్ లకూ ఫుల్ గుడ్ టైం నడుస్తుందనే చెప్పుకోవాలి! ఇంకాగట్టిగా చెప్పాలంటే… ప్రస్తుతం ఉప ఎన్నిక జరగబోతున్న హుజూరాబాద్ లో దళిత ఓటరు అయితే ఏకంగా వీఐపీ నే! ఇప్పుడు అక్కడ వారిపరిస్థితి “అవునన్నవాడు మంత్రి.. కాదన్నవాడు కంత్రీ” అనే సినిమా డైలాగులా ఉంది! ఇందులో భాగంగా… సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లికి ఒక కీలక పదవి దక్కబోతుందని తెలుస్తోంది!
అవును… రాష్ట్రంలో ప్రస్తుతం దళిత నినాదం తెరపైకి రావడంతో, మోత్కుపల్లి నర్సింహులుకు కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదేక్రమంలో… ఆయనను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని సముచిత స్థానం కల్పించే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా.. “దళిత బంధు” చైర్మన్ గా మోత్కుపల్లిని నియమించే అవకాశాలు ఉన్నాయంట!
ఈ ఊగాహాణాలకు బలం చేకూర్చే సంఘటన ఒకటి జరిగింది! “దళితబంధు” పథకం అమలుపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయగా… ఈ సమావేశానికి హాజరైన మోత్కుపల్లి నర్సింహులుకు సీఎం పక్కనే సీటు కేటాయించారు! ఫలితంగా కచ్చితంగా మోత్కుపల్లికి ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనే అంటున్నారు రాజకీయ పండితులు!
కాగా… యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు.. తెలంగాణలోని రాజకీయ నేతల్లో సీనియర్! గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన ఆయన… అనంతరం బీజేపీలో చేరి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. పైగా కేసీఆర్ ప్రవేశపెట్టిన “దళితబంధు” పథకంపై పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే!