ఎర్నాకుళం కాలామసేరిలో వరుస పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. యెవోహా ప్రార్థనా మందిరంలో 2000 మంది ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఉదయం 9.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడులో గాయపడ్డ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొద్ది క్షణాల తేడాతో వరుస పేలుళ్లు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హాలులో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. అయితే, టిఫిన్ బాంబు గా ఈ పేలుళ్లకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
జంట పేలుళ్ల ఘటనపై కాంగ్రెస్ నేత శశి థరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను తిరువనంతపురం ఎంపీ తీవ్రంగా ఖండిస్తూ పోలీసులు తక్షణమే ఈ ఘటనపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేరళలో ప్రార్ధనా మందిరంపై బాంబు దాడి వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని, అన్ని మతాలకు చెందిన పెద్దలు, నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని కోరుతున్నానని అన్నారు. మరోవైపు దాడిపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ), ఎన్ఎస్‌జీలను ఆదేశించారు.