తెలంగాణకు నాబార్డు గుడ్‌న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి లక్షా 66 వేల 384 కోట్ల రుణ సామర్థ్యంతో నాబార్డు రూపొందించిన రాష్ట్ర దృష్టి పత్రాన్ని మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలని.. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి.
నాబార్డ్ సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల పునరుద్దరణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని.. సుస్థిర వ్యవసాయం ప్రాధాన్యం గుర్తించి పంట వైవిద్యీకరణలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామన్నారు.
ధీర్ఘకాలిక ఆయిల్ పామ్ వంటి పంట సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని.. నాబార్డు సూచనల మేరకు క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు ఆయిల్ పామ్ సాగుకు సహకరించాలని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో 500 ఎకరాలను గుర్తించి అందులో ఆహార శుద్ది పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమవుతున్నదని.. సహకార రంగానికి నాబార్డు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని పేర్కొన్నారు.