తాత్కాలికంగా సినిమాలకు దూరమైన టాలీవుడ్ యువ నటి నభా నటేశ్ ఏడాది కిందట రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాంతో ఆమె తాత్కాలికంగా సినిమాలకు దూరమైంది. ఆ ప్రమాదం గురించి నభా నటేశ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆ రోడ్డు ప్రమాదం తనకు అనేక అవకాశాలను దూరం చేసిందని వెల్లడించింది. అయితే ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని భావించానని, అందుకే ఆ విషయం గురించి బాధపడడంలేదని తెలిపింది. అసలు, ఆ రోడ్డు ప్రమాదంలో తాను బతుకుతానని అనుకోలేదని, భుజం ఎముక విరిగిందని, అనేక ఆపరేషన్లు చేశారని వివరించింది.
పూర్తిగా కోలుకోవడానికి ఏడాది కాలం పట్టిందని, ఇప్పుడు తాను శారీరకంగానూ, మానసికంగానూ బలంగా ఉన్నానని నభా నటేశ్ వెల్లడించింది. ఇటువంటి ఘటనల వల్ల మనల్ని ఎందరు ఇష్టపడుతున్నారో తెలుస్తుందని పేర్కొంది. ఇకపై తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు అంగీకరిస్తానని, తాను నటించిన కొన్ని సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలిపింది.