ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లిలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 281 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కౌలు రైతుల దుస్థితి తెలియాలంటే సీఎం జగన్ సత్తెనపల్లి కౌలు రైతుల భరోసా యాత్ర సభకు రావాలన్నారు. మాచర్ల, గురజాల, పెదరూరపాడుల నుంచి ఎక్కువగా కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగాయని, గతంలో మేం ఆర్ధిక సాయంపై సీఎం జగన్ విమర్శలు చేశారన్నారు. సాయం అందుకునే రైతులు రైతులే కాదన్నారని, సీఎం జగన్ సత్తెనపల్లి జనసేన సభకు వస్తే తాను చెప్పినవన్నీ కరెక్ట్ కాదని అర్థం అవుతుందన్నారు. అంతేకాకుండా.. ‘పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తామన్నారు. క్రాప్ హాలిడే డిక్లేర్ చేయొద్దు.. జగన్ ప్రభుత్వానికి హాలిడే ఇద్దామని చెప్పాం. వారాహితో యాత్రకు సిద్దమయ్యాం.
వారాహి వాహనంపై పేర్ని నాని రకరకాల అననమానాలు సృష్టించే ప్రయత్నం చేశారు. జనసేన చట్టానికి లోబడే కార్యక్రమాలు చేపడుతోంది. సంస్థాగతంగా పార్టీ ఇంకా బలోపేతం కావాల్సి ఉంది. ఇప్పటికే 9 జిల్లాల్లో సంస్థాగత పటిష్టతపై చర్యలు చేపట్టాం. వారాహి జనసేన ఎన్నికల ప్రచార రథం. సంస్కృతిని గౌరవించుకునే విధంగా వారాహి పేరు పెట్టాం. మేం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రదల కోణంలోనే ఉంటుంది. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పుడు మూడో కృష్ణుడు వచ్చాడు. స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు రూ. 8 వేల కోట్లు అంచనా అయితే.. జే ఎస్ డబ్ల్యూ సంస్థకు రూ. 5 వేల కోట్ల సబ్సిడీలు ఇచ్చారు. జే ఎస్ డబ్ల్యూ గతంలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రయత్నించింది. అటువంటి జే ఎస్ డబ్ల్యూ సంస్థ కడప స్టీల్ ప్లాంట్ పెడుతుందని అంటున్నారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.