స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నేడు గాంధీ జయంతి వేళ నారా భువనేశ్వరి రాజమండ్రిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం 5 గంటలకు ఆమె నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. అనంతరం ఆమె ప్రసంగించారు. పాతికేళ్ల కిందటే చంద్రబాబు ఐటీ గురించి ఆలోచించారు. సైబరాబాద్ ఐటీ కేంద్రంగా ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. బిల్ గేట్స్, క్లింటన్ వంటి ప్రముఖులు హైదరాబాద్ వచ్చారంటే అందుకు కారణం చంద్రబాబు. హైదరాబాదులో పేరుమోసిన ఐటీ కంపెనీలు వచ్చాయంటే చంద్రబాబు కఠోరశ్రమే కారణం. చంద్రబాబు రోజుకు 19 గంటలు పనిచేస్తారు.
విభజన తర్వాత ఏపీలో పోలవరం, అమరావతి గురించి కలలు కన్నారు. విభజన తర్వాత సీఎం అయ్యాక ఆయన పడిన కష్టం ఎప్పుడూ చూడలేదు. రోజుకు కేవలం మూడ్నాలుగు గంటలే నిద్రపోయేవారు. ఒక ఇల్లు కట్టాలంటేనే కొన్నిసార్లు రెండేళ్ల సమయం పడుతుంది. అలాంటిది ఏమీ లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించండి.
కానీ ప్రజలు చంద్రబాబును దూరం చేసుకున్నారు. ఈసారి అటువంటి పొరపాటు జరగనివ్వవద్దు. మీ ఓటు వేసి టీడీపీని గెలిపించండి. మేం అందరం జైలుకు వెళ్లినా మాకు బాధలేదు… పార్టీని నడిపించే కార్యకర్తలు మాకున్నారు… వాళ్లే పార్టీని ముందుకు తీసుకెళతారు” అంటూ భువనేశ్వరి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.