నందమూరి తారక రామారావు చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతి నందమూరి, నారా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. చిన్నమ్మ కంఠమనేని ఉమామహేశ్వరి గారు ఇక లేరన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆమె మరణ సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. కుటుంబంలో ఏ శుభకార్యమైనా చిన్నమ్మ ఎంతో పెద్దమనసుతో దగ్గరుండి జరిపించేవారని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. మార్గదర్శిగా నిలిచిన చిన్నమ్మ మృతి తమ కుటుంబానికి కోలుకోలేని విషాదం అని పేర్కొన్నారు. చిన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అంతకు ముందు.. చంద్రబాబు భావోద్వేగభరిత ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సదరు ట్వీట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మధ్యనే కుటుంబ సభ్యులందరం కలుసుకుని ఆనందంగా గడిపామని గుర్తు చేసుకున్న చంద్రబాబు… ఇంతలోనే ఇంతటి విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరమని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా, శాంతంగా ఉండేవారని చంద్రబాబు తెలిపారు. ఉమా మహేశ్వరి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని సంతాపం తెలిపారు చంద్రబాబు.