మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్. ఇవాళ.. నంద్యాల జిల్లా ప్యాపిలి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలు, వైఎస్ భారతిపై విమర్శలు గుప్పించారు. జగన్ దళితులకు చేసింది ఏమీ లేదని, ఎస్సీల భేటీలో అంటే ఆ వీడియో ఫేక్ ఎడిట్ చేశారని లోకేష్ మండిపడ్డారు. పదేళ్ల నుంచి సాక్షిలో తనపై అసత్య వార్తలు రాస్తున్నారని యువనేత ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సాక్షి పత్రిక, ఛానెల్, వైసీపీ నేతలు, సాక్షి యజమాని వైఎస్ భారతి దళితులను అవమానపరిచారని, తాను వైసీపీ నేతలకు, వైఎస్ భారతికి ఛాలెంజ్ చేస్తున్నానని, వాళ్లు రాసిన వార్తకు సంబంధించిన అసలైన వీడియో విడుదల చేయాలి లోకేష్ డిమాండ్ చేశారు. లేదంటే దళితులకు క్షమాపణ చెప్పాలన్నారు. తాను ఇప్పటికే అసలైన వీడియో మీడియాకు విడుదల చేశానని లోకేష్ చెప్పారు. దళితులను చంపుతున్న వైసీపీ నేతలు.. తాను అవమానించానని మాట్లాడటం విడ్డూరంగా ఉందని లోకేశ్ మండిపడ్డారు.
జగన్‌కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదని, రైతులు పడే కష్టాల గురించి పట్టించుకోవడం మానేశారని లోకేష్ దుయ్యబట్టారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం గుడిపాడు బస నుంచి శుక్రవారం ఉదయం 8 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. గుడిపాడు బస నుంచి లోకేష్ బయటకు రాగానే స్థానికి మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి పోతుదొడ్డి, మానుదొడ్డి, హనుమంతరాయనిపల్లె మీదు ప్యాపిలి శివారుకు చేరుకున్నారు. ఇక్కడ విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ పాదయాత్ర మొదలుపెట్టి ప్యాపిలికి చేరుకున్నారు. లోకేశ్‌తో కలిసి బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ, డోన్ నియోజకవర్గ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి, టీడీపీ యువనేత భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి నడక సాగించారు.