గ్రూప్-1 నిర్వహణలో గూడుపుఠాణి జరిగిందని ఆరోపించారు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. డిజిటల్, మాన్యువల్ వాల్యూయేషన్ లో భారీ తేడాలు ఉన్నాయన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు అన్యాయం అయ్యారని విచారం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటాలో కోతలతో ఆశావాహులు ఆందోళనలో ఉన్నారని అన్నారు. డిజిటల్, మాన్యువల్, వాల్యూయేషన్ లో 202 మంది అవుటయ్యారని, అవకతవకలపై గవర్నర్ దృష్టిసారించి న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 ఇంటర్వ్యూల ఎంపికలో అక్రమాలకు పాల్పడి వందలాది మంది ప్రతిభావంతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు.
జగన్ సర్కారు వారి పాట ఆట కట్టిస్తామని హెచ్చరించారు నారా లోకేష్. 30కిపైగా సిబిఐ, ఈడి కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ నిర్వహణలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 కూడా అవకతవకలతోనే సాగిందని ఎద్దేవా చేశారు. డిజిటల్ విధానంలో ఎంపికైన 326 మందిలో 124 మంది మాత్రమే మాన్యువల్ వాల్యుయేషన్ లో ఎంపిక కావడం వెనుక మతలబు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ లో మాయాజాలం జరిగిందా? మాన్యువల్ లో అవకతవకలు చోటుచేసుకున్నాయా? అనేది ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.