నారా లోకేష్ …భవిష్యత్‌లో టీడీపీని నడిపించే నాయకుడు. ఎంతకాదు అనుకున్న చంద్రబాబు టీడీపీ బాధ్యతలు లోకేష్‌కే అప్పగిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే చాలాకాలం నుంచి చినబాబుని రాజకీయాల్లో యాక్టివ్ చేసుకుంటూ వచ్చారు. గతంలో అధికారంలో ఉండగా ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చారు. అయితే అదే పార్టీకి పెద్ద మైనస్ అయింది. ప్రజల్లో నుంచి గెలవకుండా ఎమ్మెల్సీ ద్వారా మంత్రిని చేయడాన్ని జనాలు అంగీకరించలేదు. అలాగే లోకేష్ మాట తీరు, బాడీ లాంగ్వేజ్ కూడా సరిగ్గా ఉండేది కాదు.
దీంతో 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన లోకేష్‌కు ఓటమి ఎదురైంది. మంగళగిరి బరిలో లోకేష్ ఘోరంగా ఓడిపోయారు. అటు టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోయి, అధికారాన్ని కోల్పోయింది. అయితే పార్టీ ఓటమి పాలవ్వడంతో లోకేష్ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. ప్రజల మధ్యలోకి వెళ్ళుతున్నారు. ఏ విషయన్నైనా స్పష్టంగా మాట్లాడుతున్నారు.
టోటల్‌గా మాట తీరు, వంటితీరు మారాయి. ప్రజా సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. కార్యకర్తలకు, నేతలకు అండగా ఉంటున్నారు. అయితే ఇంత చేస్తున్న లోకేష్…నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి కష్టపడుతున్నట్లు కనిపించడం లేదు. రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టి, మంగళగిరిని వదిలేశారు. అంటే రాష్ట్ర రాజకీయాల్లో తిరిగితే మంగళగిరిలో బలోపేతం అయిపోతామని చినబాబు అనుకుంటున్నట్లు ఉన్నారు.
కానీ చినబాబుకు ఆ స్టేజ్ ఇంకా రాలేదు. ఇప్పుడు చంద్రబాబు, కుప్పం వెళ్లకపోయిన గెలవగలరు. అలాగే జగన్, పులివెందుల వెళ్లకపోయిన గెలవగలరు. కానీ లోకేష్ పరిస్తితి అలా కాదు. ఇంకా ఆ స్టేజ్ రాలేదు. ఖచ్చితంగా మంగళగిరిలో లోకేష్ పనిచేయాలి. అక్కడి ప్రజలకు మరింత దగ్గరవ్వాలి. వారి సమస్యలపై పోరాటం చేయాలి. వారికి కూడా కాస్త సమయం ఇవ్వాలి. అలా చేయకుండా డైరక్ట్‌గా ఎన్నికల్లో పోటీ చేస్తే చినబాబుకే ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు.