కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏపీకి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..?
కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో ఆగి ఉన్న లారీని జీపు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. మృతులంతా ఏపీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతులు మునీర్(40), నయామత్(40), రమీజా బేగం(50), ముద్దత్ షీర్(12), సుమ్మి(13).. నంద్యాల జిల్లా వెలగోడు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. బాధితులు కలబురిగిలో దర్గా ఉరుసు జాతరకు వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగిందా.. లేక అతి వేగమే ప్రమాదానికి కారణమా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.