పంజాబ్ బఠిండా మిలటరీ స్టేషన్లో జరిగిన కాల్పుల్లో ఇప్పటికే నలుగు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. కాల్పులు జరిగిన కొద్ది గంటల్లోనే చోటు చేసుకొన్న మరో ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం సాయంత్రం ఓ జవాను బుల్లెట్ గాయంతో మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
ఈ జవాను ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో అతడు మరణించి ఉంటాడని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. మృతుడిని సెంట్రీ విధులు నిర్వర్తిస్తున్న లఘు రాజ్ శంకర్‌గా గుర్తించారు.
శంకర్ ఏప్రిల్ 11నే సెలవులు పూర్తిచేసుకుని వచ్చి తిరిగి విధుల్లో చేరినట్లు అధికారులు వెల్లడించారు. ‘‘బుధవారం సాయంత్రం సెంట్రీ విధుల్లో ఉన్న శంకర్ కుడి కణతి వద్ద బుల్లెట్ గాయంతో విగతజీవిగా కన్పించాడు. అతడి పక్కనే సర్వీసు రివాల్వర్ పడిపోయి ఉంది. అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు.. లేదా ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి చనిపోయే అవకాశం కూడా ఉంది’’ అని ఆర్మీ అధికారులు వెల్లడించారు.