ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఇప్పటికే ఆలయ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ ప్రారంభ ముహూర్తం సమయానికి… తొలి సౌర నగరంగా అయోధ్య అవతరించనుంది. యూపీ పునరుత్పాదక ఇంధన శాఖ ఈ దిశగా.. పనులను యుద్ధప్రాతిపదికను చేస్తున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
అయోధ్య నగరాన్నిఇటీవల పర్యవేక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్… సూర్యవంశానికి రాజధాని అయోధ్య కాబట్టి, ఇక్కడ ఇతర మార్గాల ద్వారా కాకుండా ఆ సూర్యుడి ద్వారానే విద్యుత్తు ప్రసరిస్తుందని ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా సరయూ నది ఒడ్డున 40 మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాలు మొదలు సౌరశక్తితో నడిచే పడవలు, ప్రజా రవాణా, మొబైల్ చార్జింగ్ కేంద్రాలు, ప్రభుత్వ భవనాల విద్యుదీకరణ…ఇలా సర్వం సోలార్ పవర్ ఆధారంగానే నడవనున్నాయి.
మరోవైపు జనవరి 22న రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్ర ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.