దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు విచారించారు. ఆదివారం రోజున దాదాపు 9 గంటల పాటు సీబీఐ అధికారులు.. కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఉదయం 11 గంటల తర్వాత సెంట్రల్ దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన కేజ్రీ.. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బయటకొచ్చారు.
అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ…”సీబీఐ దాదాపు 9 గంటల పాటు నన్ను ప్రశ్నించింది. సీబీఐ అడిగిన 56 ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. మద్యం కుంభకోణంలో అన్నీ తప్పుడు ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారు. ఆప్ ‘కత్తర్ ఇమాందార్ పార్టీ’. ఆప్‌ను అంతం చేయాలనుకుంటున్నారు. కానీ, దేశ ప్రజలు మాతోనే ఉన్నారు” అంటూ వ్యాఖ్యలు చేశారు.
అసలు లిక్కర్ స్కామ్ అనేది లేదన్న కేజ్రీవాల్.. కావాలనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే క్రమంలో కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.