మరో కీలక ఘట్టానికి చంద్రయాన్-3 చేరువైంది. క్రమంగా ఈ వ్యోమ నౌక జాబిల్లిని సమీపిస్తోంది. నేడు జాబిల్లి కక్ష్యంలోకి చంద్రయాన్-3 ప్రవేశించనుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం నాటికి చంద్రయాన్-3 మూడింట రెండొంతుల దూరాన్ని అధిగమించిందని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. భూమి నుంచి 2.6 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. ఇవాళ రాత్రి 7.00 గంటల సమయంలో లూనార్ ఆర్బిట్ ఇంజెక్షన్ (ఎల్‌వోఐ) అనే మరో కీలక విన్యాసాన్ని ఇస్రో చేపడుతుంది. ఫలితంగా చంద్రయాన్-3.. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
చంద్రుడికి దగ్గరగా ఉండే బిందువు (పెరిలూన్)లోకి చంద్రయాన్-3 ప్రవేశించినప్పుడు ఈ విన్యాసాన్ని శాస్త్రవేత్తలు చేపడతారు. గత నెల 14న ఎల్‌వీఎం3 ఎం-4 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూడు వారాల్లో ఐదుసార్లు కక్ష్యను పెంచుతూ భూమికి దూరంగా చంద్రయాన్-3ని తీసుకెళ్లారు. ఆగస్టు 1న ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ (టీఎల్‌ఐ) అనే కీలక విన్యాసంతో ఈ వ్యోమనౌకను చందమామను చేరుకునే మార్గం (లునార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీ)లోకి ప్రవేశపెట్టారు. నాటి నుంచి అది జాబిల్లి దిశగా పయనిస్తోంది. చంద్రయాన్-3 ల్యాండర్.. ఈ నెల 23న జాబిల్లిపై దిగుతుంది.