ఈస్ట్ జావాలో జరిగిన ఇండోనేషియన్ లీగ్ ఫుట్ బాల్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పెర్సేబాయ సురబాయ జట్టు చేతిలో అరేమో టీం (3-2) తేడాతో ఓడిపోయింది. సొంత మైదానంలో చిరకాల ప్రత్యర్ధుల చేతిలో ఓటమిపాలయ్యామని ఆగ్రహించిన అభిమానులు మైదానంలోకి ఒక్కసారిగా దూసుకెళ్లి అల్లర్లకు పాల్పడ్డారు. ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగగా.. పోలీసులు రంగంలోకి దిగారు.
ఆందోళనకారులను అదుపు చేసేందుకు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. వారిని చెదరగొట్టేందుకు లాటి ఛార్జ్ చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పోలీసు అధికారులు, పిల్లలు, అభిమానులు ఇలా చాలామంది మరణించారు. ఇందులో ఇద్దరు పోలిసు అధికారులు ఉన్నారు. ఈ ఘటనలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 182 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువమంది 17 ఏళ్లు నిండని వారేనని తెలిపారు. ఒక ఎగ్జిట్ గేట్ నుంచి ఒక్కసారిగా అందరూ పరిగెత్తడంతో ఈ ఘటన జరిగింది.