వేసవి వచ్చేసింది. ఈ సీజన్లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చిన్న నిప్పురవ్వ రేగినా అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఇలాంటి ప్రమాదాల్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఏడాది చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇలాంటి ఘోర అగ్నిప్రమాదం బిహార్‌లోనూ చోటుచేసుకుంది.
ఆ రాష్ట్రంలోని ముజఫర్‌పుర్ జిల్లాలోని రామ్‌దయాళ్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాలికలు సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రి మొత్తం కాలి బుడిదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌దయాళ్ ప్రాంతంలోని స్లమ్‌లో నివసించే ఓ కుటుంబానికి సంబంధించిన ఇంట్లో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇవి కాస్త పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లకి వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు బాలికలు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స కోసం వారిని ఎస్కేఎమ్సీఎచ్ ఆస్పత్రికి తరలించారు.