ఉత్తరప్రదేశ్ లో అయోధ్య జిల్లా యంత్రాంగం చరిత్ర సృష్టించింది. దీపావళి సందర్భంగా మొత్తం 51 ఘాట్లలో 22.23 లక్షల దీపాలను వెలిగించి గిన్నీస్ రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో గత ఏడాది 15.76లక్షల దీపాలను వెలిగించిన తమ రికార్డునే తిరగరాసింది. ఈ దీపకాంతులతో సరయూ నదీతీరమంతా దేదీప్యమానంగా వెలుగుతోంది. దీపాలంకరణ కోసం మొత్తం 25వేల మంది వాలంటీర్లు పాల్గొనడం విశేషం.
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల బృందం హాజరై డ్రోన్ కెమెరాలతో దీపాలను లెక్కించింది. మరోవైపు అయోధ్యలో రామమందిర పనులను శరవేగంగా జరుగుతున్న వేళలో ఈ ఏడాది దీపోత్సవం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. దాదాపు 50 దేశాలకు చెందిన ప్రతినిధులు, రాయబారులు, ఉన్నతాధికారులు దీపోత్సవ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మహా హారతి ఇచ్చి ప్రారంభించారు. తొమ్మిదేళ్లలో దేశంలో ప్రధాని మోడీ స్థాపించిన రామరాజ్యం పునాదిని అయోధ్య మందిర నిర్మాణం బలపరుస్తుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దీపోత్సవం తరువాత ప్రత్యేక లేజర్ షో ఏర్పాటు చేశారు.