కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 17వ తేదీన అధ్యక్ష పదవికి ఎన్నికలు కాగా.. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఏకాభిప్రాయంతో అభ్యర్థి నియామకమైతే మంచిదని పోటీలో ఉన్న మరో అభ్యర్థి శశితరూర్ కు తాను ఇప్పటికే చెప్పినట్లు పేర్కొన్నారు.
సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలెవరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకోవడం లేదన్నారు. దీంతో కొంతమంది సీనియర్ సహచర నేతలు తనని పోటీ చేయమని కోరినట్లు తెలిపారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా పోటీ చేయడం లేదన్నారు మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసమే పోరాడుతున్నానన్నారు. అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యే, మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం సాగించానన్నారు. మరల నా పోరాటం సాగించి, ఆ సిద్ధాంతాలు, విలువలని భావితరాలకు అందివ్వాలని భావిస్తున్నానన్నారు.