చంద్రయాన్-3తో ఓవైపు చంద్రుడిపై.. ఆదిత్య ఎల్-1తో మరోవైపు సూర్యుడిపై ప్రయోగాలు చేస్తూ ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక గుర్తింపు పొందిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో తాజాగా విషాదం చోటుచేసుకుంది. ఇస్రోలో రాకెట్ ప్రయోగాల వేళ కౌంట్‌డౌన్‌కు ఎంతటి ప్రాధాన్యం ఉందో తెలిసిందే. గంభీరమైన తన స్వరంతో కౌంట్ డౌన్ విధులు నిర్వహించే ఉద్యోగిని వాలర్‌మతి (50) గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో శనివారం రాత్రి కన్నుమూశారు. చంద్రయాన్-3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు.
వాలర్‌మతి మృతితో ఇస్రోలో విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌తో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే వాలర్‌మతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రోలో వాలర్‌మతి సేవలను స్మరించుకున్నారు. ఆమె తన గంభీరమైన కంఠంతో కౌంట్‌డౌన్ అనౌన్స్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు.