కేరళ రాష్ట్రం తన పేరును మార్చే యోచనలో ఉంది. ఆ దిశగా తొలి అడుగు కూడా వేసింది. ఈ క్రమంలో పేరు మార్చాలని ఏకంగా ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరి ఇంతకీ ఆ రాష్ట్రానికి కొత్తగా పెట్టబోయే పేరు ఏంటంటే?
కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సభలో ఇవాళ (జూన్ 24వ తేదీన) ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు మద్దతు తెలపడం వల్ల తీర్మానం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి విపక్షాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి.
గతేడాది ఆగస్టు 9వ తేదీన కూడా కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలో ఈ విషయాన్ని మొదటి షెడ్యూల్, ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరగా.. ఈ డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. ఇప్పుడు మరోసారి రాజ్యాంగంలోని ఎనిమిదో జాబితాలో పేరు మార్పు విషయాన్ని చేర్చాలనే తీర్మానాన్ని కేరళ ప్రభుత్వం పంపింది.