రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విపక్షాల కూటమి ఇండియా తప్పక ఓడిస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి పదవి వద్దని.. తాను ఎలాంటి పదవి ఆశించడం లేదని.. బీజేపీ ఓటమి చూడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కూటమి గెలుపుపైనే తన ఫోకస్ ఉందని చెప్పారు. బీజేపీ చేపట్టిన బేటీ బచావో పథకం ఇప్పుడు.. బేటీ జలావోగా మారిందని మమత విమర్శించారు.
మణిపుర్‌లో రెండు జాతుల మధ్య జరుగుతోన్న ఘర్షణల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా..మహిళల మానవత్వం మంటల్లో కలిసిపోతున్నా.. కేంద్ర సర్కార్ ఇప్పటి వరకు అక్కడికి కేంద్ర బృందాలను పంపకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ పేర్కొన్నారు. మణిపుర్‌లో మన కుమార్తెలు చనిపోతున్నారని.. బీజేపీ పాలనలో కేవలం ఇదొక్క కేసే కాదని మమతా బెనర్జీ ఆరోపించారు.
26 రాజకీయ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని మమతా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటినుంచి ‘భారత్ గెలుపు’ అనేది తమ నినాదమని స్పష్టం చేశారు. బీజేపీ సర్కార్ అవధులను దాటి ప్రవర్తిస్తోందని.. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలోకి రానీయకుండా చేయడమే తమ ధ్యేయమని చెప్పారు.