జాతుల మధ్య వైరంతో మొన్నటిదాకా అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్ ఇప్పుడిప్పుడే అల్లర్లు తగ్గి ప్రశాంతంగా మారుతోంది అనుకునేలోపే మళ్లీ మారణహోమం మొదలైంది. ఆ రాష్ట్రంలోని దౌబాల్ జిల్లాలో సాయుధ దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
లిలాంగ్ చింగ్జీవ్ ప్రాంతానికి భద్రతా బలగాలను పోలిన దుస్తులు ధరించిన దుండగులు వచ్చి ప్రజలపై కాల్పులకు తెగబడటంతో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులుగాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు నాలుగు కార్లను తగులబెట్టారు. మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడం వల్ల లోయ ప్రాంతాలైన దౌబాల్, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ, కాక్చింగ్, బిష్ణుపుర్ జిల్లాల్లో, మణిపుర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. హింసాత్మక చర్యను రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.