ఈనెల 21న ఉక్రెయిన్ నుంచి నవీన్ మృతదేహం… తండ్రి సంచలన నిర్ణయం

ఉక్రెయిన్ లో చదువుకునేందుకు వెళ్లిన ప్రతీ భారతీయుడిని ఇండియన్ గవర్నమెంట్ ‘ ఆపరేషన్ గంగ’ ద్వారా ఇండియాకు తీసుకువచ్చారు. 20 వేలకు పైగా భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన రొమేనియా, పోలాండ్, హంగేరీల నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు. కేవలం ఒక్క భారతీయుడు మాత్రమే రష్యా దాడుల వల్ల మరణించారు. ఉక్రెయిన్ లో మెడిసిన్ విద్యను అభ్యసించేందుకు వెళ్లిన కర్ణాటకకు చెందిన నవీన్ శేఖరప్ప… ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో మరణించారు. 

నవీన్ మృతదేహం సోమవారం ఉదయం 3 గంటలకు బెంగళూర్ కు చేరుకోనుంది. ఈ సమయంలో నవీన్ తండ్రి శంకరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. కుమారుడిని మృతదేహాన్ని దావణగెరెలోని ఎస్‌ఎస్‌ ఆసుపత్రికి దానం చేస్తానని నవీన్‌ తండ్రి తెలిపారు. తన కుమారుడు వైద్యరంగంలో ఏదో సాధించాలని అనుకున్నాడని…అది జరగలేదు. కనీసం అతని శరీరాన్ని ఇతర వైద్య విద్యార్థులు చదువుకోడానికి ఉపయోగించవచ్చు. అందుకే ఇంట్లో మేము అతని శరీరాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేయాలని నిర్ణయించుకున్నాము.” నవీన్ తండ్రి శంకరప్ప తెలిపారు.