ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయి. గత కొన్నిరోజులుగా రణరంగంలా మారిన మణిపుర్ ప్రస్తుతం కాస్త శాంతించింది. ఈ క్రమంలో పశ్చిమ ఇంఫాల్, బిష్ణుపుర్, చురాచాంద్‌పుర్, జిరిబమ్ సహా 11 జిల్లాల్లో కర్ఫ్యూను సడలించారు. ఉదయం 5 నుంచి ఆరు గంటల పాటు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంగళవారం వరకూ ఈ వెసులుబాటు నాలుగు గంటలే ఉండేది. కొత్తగా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు.
4 వేల మందిని వారి నివాసాలకు దగ్గర్లోనే సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి వాటిలో ఉంచినట్లు సమాచార, ప్రజా సంబంధాల మంత్రి సపమ్ రంజన్ సింగ్ వెల్లడించారు. తీవ్రంగా నష్టపోయిన కంగ్‌చుప్ చింగ్‌ఖోంగ్ ఇంఫాల్‌కు సమీపంలోని కంగ్‌చుప్ చింగ్‌ఖోంగ్.. హింసాత్మక ఆందోళనల్లో తీవ్రంగా నష్టపోయింది. ఈ ప్రాంతంలోని 50 ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఇక్కడ ఓ పాఠశాలకు నిప్పంటించడం వల్ల టేబుళ్లు, కుర్చీలు బూడిదయ్యాయి. ప్రార్థనాస్థలాలను సైతం ఆందోళనకారులు వదల్లేదు. ఎటు చూసినా.. పైకప్పు కూలిపోయి, ధ్వంసమైన ఇళ్లే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.