మీ ఉల్లంఘనలతో మన బంధానికి బీటలు.. చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్‌

-

సరిహద్దుల వద్ద హద్దులు మీరి.. నిబంధనలు ఉల్లంఘించి రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశారని చైనా రక్షణశాఖ మంత్రి లీ షాంగ్‌ఫూనకు మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అన్ని సమస్యలను ప్రస్తుత ఒప్పందాల ప్రకారమే పరిష్కరించుకోవాల్సి ఉందని తేల్చి చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల ఒప్పందాలను ఉల్లంఘించడం సరికాదని హితవు పలికారు. గురువారం దిల్లీలో ఇద్దరు నేతలు సుమారు 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. మూడేళ్లుగా రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్‌, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడితే సరిహద్దు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా లీతో పేర్కొన్నారు. సమావేశం అనంతరం రక్షణశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సరిహద్దుల అభివృద్ధి, రెండు దేశాల సంబంధాలపై ఇద్దరు మంత్రులు నిజాయతీగా మాట్లాడుకున్నారు. అన్ని వివాదాలను ప్రస్తుతమున్న సరిహద్దు ఒప్పందాల ప్రాతిపదికనే పరిష్కరించుకుందామని రాజ్‌నాథ్‌ సూచించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే సైనిక సహకారంపై అవగాహనకు రావచ్చని ఆయన స్పష్టం చేశారు’ అని రక్షణశాఖ వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version