అర్ధంకాని రేవంత్ స్ట్రాటజీ..ఈటలకు సపోర్ట్ ఉందా?

-

హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అసలు అర్ధం కావడం లేదనే చెప్పొచ్చు. అసలు హుజూరాబాద్‌లో ఆయన టార్గెట్ ఏంటో రాజకీయ విశ్లేషకులకే అర్ధం కావడం లేదు. కేసీఆర్‌ని ఓడించాలని రేవంత్ అనుకుంటున్నారు గానీ, కాంగ్రెస్ గెలవాలని ఎక్కడా మాట్లాడటం లేదు. గత కొన్ని రోజులుగా రేవంత్ మాటలు చూస్తే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పరిస్తితి ఏం అవుతుందనేది అర్ధం కావడం లేదు.

revanth reddy etela rajenderఅయితే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, ఈటల రాజేందర్ మధ్యే ప్రధాన పోటీ జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పరిస్తితి ఘోరంగా ఉందనే చెప్పొచ్చు. ఇక్కడ ఆ పార్టీకి బలమైన నాయకులు లేరు. అలా అని కాంగ్రెస్‌కు ఇక్కడ గెలిచే సీన్ లేదు. అందుకే రేవంత్ సైతం హుజూరాబాద్ ఉపఎన్నికని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అసలు ఇక్కడ పెద్దగా పోరాడాలని రేవంత్ అనుకున్నట్లు లేరు.  పైగా కాంగ్రెస్ పోరాడితే ఎక్కువ ఓట్లు చీలి, అది టీఆర్ఎస్‌కే బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో రేవంత్ సైలెంట్‌గా ఉంటున్నారు.

కాకపోతే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ని ఓడించాలని మాత్రం నినదిస్తున్నారు. తాజాగా రావిర్యాలలో జరిగిన దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో సైతం హుజూరాబాద్ ప్రజలు…కేసీఆర్‌ని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్తు సువర్ణ అక్షరాలతో లిఖించే అవకాశం హుజూరాబాద్‌ బిడ్డల చేతిలో ఉందని, నయాజిత్తుల నక్క ఓట్ల కోసం బొక్కలో నుంచి బయటకు వచ్చిందని, ఇపుడే ఆ నక్కను తోకపట్టి కొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌ ప్రజలు గునపంతో ఒక గుద్దు గుద్దితే కేసీఆర్‌ గుండెలు పగలాలి అని మాట్లాడారు.

అయితే రేవంత్ ఇక్కడ కేసీఆర్‌ని ఓడించాలని అంటున్నారుగానీ, కాంగ్రెస్‌ని గెలిపించాలని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అంటే ఇక్కడ రేవంత్ టార్గెట్ టీఆర్ఎస్ ఓడటమే గానీ, కాంగ్రెస్ గెలవడం కాదని తెలుస్తోంది. అంటే రేవంత్ పరోక్షంగా ఈటల గెలవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news