‘నచ్చిన పేర్లు ఎంపిక చేయొద్దు’.. కొలీజియం సిఫార్సులపై కేంద్రానికి సుప్రీం హితవు

-

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో కొలీజియం పంపిన సిఫార్సులపై కేంద్రం వైఖరిని తప్పుబట్టింది. తాము చేసిన సిఫార్సుల్లో కొన్ని పేర్లకే ఆమోదం చెబుతూ.. ‘తమకు నచ్చినట్లు ఎంపిక’ విధానాన్ని పాటిస్తోందని పేర్కొంది. ఇలా విధివిధానాలను ఇష్టం వచ్చినట్లు మార్చడం.. మంచి పరిణామం కాదని స్పష్టం చేసింది. బదిలీ కోసం 11 మంది జడ్జీల పేర్లను కొలీజియం సిఫార్సు చేయగా.. అందులో ఐదుగురే బదిలీ అయ్యారని.. ఆరు పేర్లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.

‘ఇది మంచి పరిణామం కాదని గతంలోనూ చెప్పానని.. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సంకేతాన్ని పంపుతోందని కొలీజియం సభ్యుడైన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌.. అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణిని ప్రశ్నించారు. న్యాయమూర్తుల ఎంపిక, బదిలీ కోసం కొలీజియం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలపడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ దాఖలైన రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపిక చేసిన రీతిలో నియామకాలు చేపట్టడం వల్ల న్యాయమూర్తులు సీనియార్టీని కోల్పోతారని కోర్టు అభిప్రాయపడింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి  వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version