హుజూరాబాద్ ఉప పోరుకు సంబంధించి అధికార టీఆర్ఎస్, బీజేపీ (BJP, TRS)ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలోనే హుజూరాబాద్ ఉప పోరు జరగనుంది. రెండు నెలల వ్యవధిలోనే హుజూరాబాద్ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం చూస్తుంది.
ఇక ఈ ఉప పోరులో సత్తా చాటాలని అధికార టీఆర్ఎస్ చూస్తుంది. అటు బీజేపీ సైతం దుబ్బాక మాదిరిగానే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని భావిస్తుంది. అందుకే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ టార్గెట్‌గా టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తుంది. కేంద్రం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని, అలాగే నీటికి సంబంధించిన విషయంలో బీజేపీని కార్నర్ చేయడానికి చూస్తుంది.
ఇలా టీఆర్ఎస్ బీజేపీని కార్నర్ చేయడం వల్ల ఈటల రాజేందర్‌కు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అనే విశ్లేషణలు వస్తున్నాయి. బీజేపీని నెగిటివ్ చేస్తే అది ఈటలపై ప్రభావం చూపించవచ్చని భావిస్తున్నారు. కానీ హుజూరాబాద్‌లో ఆ పరిస్తితి ఉన్నట్లు కనిపించడం లేదు. ఈటల బీజేపీలో చేరినా సరే ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అనే విధంగానే చూస్తున్నారు. ఎందుకంటే హుజూరాబాద్‌లో బీజేపీకి పెద్దగా ఓట్లు లేవు.
గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదు. కనీసం నోటాని కూడా దాటలేదు. అయితే ఈటల బీజేపీలో రావడం వల్లే, ఆ పార్టీకి కాస్త ఊపు వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేయడం వల్ల ఈటల మీద పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కేంద్రంలో ఉండే సమస్యలు హుజూరాబాద్ ప్రజలు పట్టించుకోకపోవచ్చు. కాబట్టి బీజేపీని టార్గెట్ చేయడం వల్ల ఈటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు.