పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈడీ విచారణకు పిలవడం సరైనదేనా? అంటూ.. ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. పార్లమెంట్ సమావేశాలతో సంబంధం లేకుండా.. దర్యాప్తు సంస్థల విచారణకు హాజరుకావాలని సూచించారు. చట్టాలను చేసే పౌరులుగా.. అది మన బాధ్యత అని గుర్తుచేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జులై 18న ప్రారంభమైన సమావేశాలు.. ఆగస్టు 12న ముగియనున్నాయి.
“పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా.. లేకపోయినా.. ఎంపీలు దర్యాప్తు సంస్థలు పిలిచే విచారణలకు హాజరుకావాలి. చట్టాలను చేసే పౌరులుగా.. ఆ చట్టాలను, న్యాయ ప్రక్రియను గౌరవించడం మన బాధ్యత.”
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్
ఇటీవల రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేయడం వల్ల గురువారం సభలో దుమారం చెలరేగింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం ప్రస్తావించారు ఖర్గే. కాంగ్రెస్ను భాజపా భయపెట్టాలని చూస్తోందని.. అయితే దీనికి భయపడబోమని అన్నారు.