గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వల్లే బీజేపీ.. సీఏఏ, ఎన్ఆర్సీలను ఉపయోగిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లో సీఏఏని ఎప్పటికీ అమలు జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. తమ రాష్ట్రాన్ని ముక్కలు కానిచ్చేదేలేదని స్పష్టం చేశారు. కృష్ణానగర్‌లో నిర్వహించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో దీదీ మాట్లాడారు.
ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారీ బీజేపీ.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అంశాలపై మాట్లాడుతుంటుందని దీదీ అన్నారు. డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికలు, మరో ఏడాదిన్నరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో సీఏఏ అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని ఫైర్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతాల్లో నివసించే రాజ్‌బన్షీలు, గూర్ఖాలను రెచ్చగొట్టడం ద్వారా వేర్పాటువాదాన్ని బీజేపీ ప్రేరేపిస్తోందని దీదీ మండిపడ్డారు. 2024 జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాదని పునరుద్ఘాటించారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం తగ్గిపోతుండటం వల్లే ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీలపై దాడులకు దిగడం, ప్రతిపక్ష నేతలను దూషిస్తూ అరెస్టులు చేయించడం వంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు.