పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్‌కు ఈ నెల 26న అక్షరాభ్యాసం జరగనుంది! ఈ వయసులో అక్షరాభ్యాసం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే అయినా.. ఇదే నిజం. అయితే ఆయనకు బెంగాళీ భాషలో అక్షరాభ్యాసం చేయిస్తున్నారట. ఎందుకంటే..?
ఈ నెల 26న సరస్వతీ పూజను పురస్కరించుకొని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో గవర్నర్ ఆనందబోస్‌కు రాజ్‌భవన్‌లో అక్షరాభ్యాసం జరగనుంది. సాధారణంగా బెంగాలీ (బంగ్లా) భాషలోని అక్షరాలను నేర్చుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు చిన్నారులకు ‘హతేఖోరీ’ పేరుతో సంప్రదాయ రీతిలో అక్షరాభ్యాస తంతును నిర్వహిస్తారు.
ఇప్పటికే ఆంగ్లం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40 పుస్తకాలు రాసిన ఆనందబోస్.. బెంగాలీలోనూ ఓ పుస్తకం రాయాలన్న తన ఆసక్తిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులైన తొలినాళ్లలోనే వెలిబుచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగానే భాష నేర్చుకునేందుకు తాజాగా అక్షరాభ్యాస ముహూర్తం నిశ్చయించుకున్నారు.