కట్టుకున్న భర్త అయినా సరే ఇష్టం లేని సెక్స్‌ను నిరాకరించే హక్కు ప్రతి మహిళకు కూడా ఉంటుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. భర్త బలవంతంగా సెక్స్‌కు పాల్పడితే వివాహమైనంత మాత్రాన మహిళ కేవలం సివిల్, క్రిమినల్ చట్టాలను మాత్రమే ఆశ్రయించాలా? ఆ కేసులో అత్యాచారం సెక్షన్ వర్తించదా అనడం సరికాదు అని అభిప్రాయపడింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ రాజీవ్ శక్దేర్, జస్టిస్ సి.హరిశంకర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్నారని ధర్మాసనం పేర్కొన్నది. అయితే, ఇండియన్ పినల్ కోడ్ 375 సెక్షన్ పరిధిలో భర్తలకు ప్రస్తుతం ఉన్న మినహాయింపులను రద్దు చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం తరఫున న్యాయవాది నందిత రావు వాదించారు.
జస్టిస్ శక్దేర్ స్పందిస్తూ ఓ మహిళ నెలసరిలో ఉన్నప్పుడు భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించారనకోండి. అయినా బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డారునుకోండి. అది నేరం కాదా అని ప్రశ్నించారు. న్యాయవాది బదులిస్తూ అది నేరమే. కానీ, అత్యాచారం చట్టం పరిధిలోకి రాదు అని బదులిచ్చారు.