కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సెటైర్లు వేశారు. శరద్ పవార్, పృథ్వీరాజ్ చవాన్ ,ఉద్ధవ్ ఠాక్రే శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ…గతంలో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని మూడు చక్రాల రిక్షాగా దేవేంద్ర ఫడ్నవిస్ కామెంట్ చేయడాన్ని ఉద్ధవ్ గుర్తు చేశారు.ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానిది రిక్షా పరిస్థితేనని ఉద్ధవ్ థాక్రే ఎద్దేవా చేశారు.
‘ఇప్పుడు కేంద్రంలో ఉన్నది మోదీ ప్రభుత్వం కాదు.. ఎన్డీయే ప్రభుత్వం. ఇది ఎంతకాలం అధికారంలో కొనసాగుతుందో తెలియదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు పార్టీని విడిచి మళ్లీ ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నవారికి మా పార్టీలో చోటు లేదు అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పార్టీలో చేర్చుకోం. అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా మహా వికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుంది. అందుకు సమష్టి కృషి ఇప్పటికే ప్రారంభమైంది’అని ఉద్థవ్ పేర్కొన్నారు.