ఈరోజు బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. దేశంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలు దేశమంతటా అమలవుతాయని తెలియచేశారు. ఆయన ప్రసంగిస్తూ, అభివృద్ధి, సంక్షేమ రంగాలు ప్రభుత్వానికి రెండు కళ్లులాంటివని, ఈ రెండింటిని కూడా తెలంగాణ ప్రభుత్వం సమానంగా ముందుకు తీసుకెళ్తుందని వెల్లడించారు స్పీకర్ పోచారం. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు తమకు కావాలని పక్కనున్న రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారని, లేకపోతే తమ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు ఆయన.
దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వ్యక్తపరిచారు స్పీకర్ పోచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో 2014 తరువాత బాన్సువాడ నియోజకవర్గానికి పదివేల కోట్ల రూపాయల నిధులు ఖర్చుచేసినట్లు తెలిపారు ఆయన. మిషన్ కాకతీయ , నిజాంసాగర్ ప్రాజెక్టు కింద సాగునీటి రంగానికి వెయ్యికోట్లు ఖర్చు చేశామన్నారు స్పీకర్. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.