టీ పీసీసీ చీఫ్, పార్టీ పరిస్థితి పై టెన్షన్ లో ఉన్న కాంగ్రెస్ నేతలను మరో అంశం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందట. కార్పోరేషన్,గ్రాడ్యుయేట్, సాగర్ ఉప ఎన్నిక ఇలా వరుస పరీక్షలు నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నాయట..ఒక పక్క బీజేపీ స్పీడు పెంచడం మరో పక్క ఆర్ధిక వనరుల సమస్య ఇలా ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలంటేనే నేతల హడలి పోతున్నారట….
ఎన్నికలంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. కానీ..ఇప్పుడు సీన్ మారింది. ఎన్నికలకు ఇంఛార్జ్‌గా ఉండటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది కాంగ్రెస్ సంస్కృతికి భిన్నం. అందుకే ఇంఛార్జ్ బాధ్యతలు స్వీకరించడానికి నాయకులు ఎందుకు భయపడుతున్నారు అన్నదే పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న పార్టీ.. ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌పై ఆశలు పెట్టుకుంది. ఇంఛార్జ్‌గా ఒక నాయకుడిని ఎంపిక చేస్తే బెటర్ అనే ఆలోచన కాంగ్రెస్‌లో వచ్చిందట. అదే విషయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ప్రస్తావించినప్పుడు నాయకులు ఆసక్తి కనవరచలేదట….
పాలమూరు..రంగారెడ్డి..హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఠాగూర్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశం ఉండటంతో ఇంఛార్జి ల నియామకం చేపట్టాలని ఠాగూర్ భావించారు. సమావేశలో ఉన్న రేవంత్… మర్రి శశిధర్ రెడ్డి లాంటి నాయకులను పురామయించారట. అమ్మో ఇంఛార్జి వద్దు… ఏం వద్దని చెప్పేశారట. ఎన్నికల్లో డబ్బులు ప్రచారం టైం ఇవ్వడానికి అంతా సిద్ధంగానే ఉన్నా.. ఇంఛార్జ్‌గా ఉంటే గ్రాఫ్ ఎక్కడ పడిపోతుందో అనే భయం పట్టుకుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త తలనొప్పులు ఎందుకని కొందరు భావిస్తున్నారట.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓడితే.. అది ఇంఛార్జ్‌గా ఉన్న నాయకుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ ఎంపిక అంశం మళ్లీ తెరమీదకు వస్తుంది. ఇప్పుడు ఇంఛార్జ్‌గా ఉంటే పీసీసీ చీఫ్ రేస్‌లో ఉన్నవారికి ఇబ్బందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫలితం అనుకూలంగా లేకపోతే మాత్రం జాతకాలు తిరగబడతాయి.
ఇప్పటికే గ్రేటర్‌లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. ఆయనంటే గిట్టని వారంతా.. దీన్ని సాకుగా చూపించారట. ఫలితం అనుకూలంగా వస్తే పార్టీ ఇమేజ్ అంటారు. ఓడిపోతే ఇంఛార్జి ఫెయిల్యూర్ ఖాతాలో వేస్తారు అనేది సదరు నాయకుడి ఆలోచన. అసలే పీసీసీ రేసులో ఉన్న సదరు నాయకుడు.. ఆచి తూచి సైడ్ అయ్యారనే చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఖాతాలో ఎలాగైతే ఫెయిల్యూర్ లిస్ట్ పెరిగిందో.. అది తలచుకుని ఎవరికి వారు… వద్దు బాబోయ్ అంటున్నారట.