ఏపీలో రాజకీయ పరిణామాలు అంచనాలకు అందడం లేదు.. గంటగంటకూ.. రోజురోజుకూ మారిపోతున్నాయి. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీల మధ్య రాజకీయం రంజుగా మారుతోంది. బీజేపీతో కలిసి నడిచేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్నేహగీతిక ఆలపిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీతో కలిసి నడిచే అవకాశమే లేదని, ఆ పార్టీ నేతలను మాత్రం బీజేపీలో చేర్చుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర నేతలు బహిరంగానే చెబుతున్నారు. మరోవైపు.. టీడీపీ కీలక నేతలందరూ బీజేపీలోకి వెళ్తే.. తమకు నష్టం జరుగుతుందన్న భావనతో వైసీపీ కూడా చిన్నగా తలుపులు తెరుస్తోంది.
మొత్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారం లో ఉన్న వైసీపీలు రెండూ టీడీపీ టార్గెట్‌గా ముందుకు కదులుతున్నాయన్నమాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఉనికిపాట్లు పడుతున్న టీడీపీని.. ఇదే అదనుగా మరింతగా తొక్కిపడేసి.. వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న వ్యూహంతో కమలదళం ఉంది. అందుకు తగ్గట్టుగానే ముందుకు వెళ్తోంది. ఏపీలో టీడీపీని ఖతం చేస్తేనే తప్ప కమలవికాసం జరగదన్న పట్టుదలతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ప్రధానంగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చకచకా పావులు కదుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల అయిపోగానే.. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను లాగేశారు. ఊహించని వలసలతో ఉక్కిబిక్కిరి అవుతున్న చంద్రబాబు.. వ్యూహాత్మకంగా మళ్లీ స్నేహగీతిక ఆలపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మళ్లీ బీజేపీతో కలిసి నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసి నడిచే అవకాశమే లేదని కమలం నేతలు తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ పార్టీ నేతలను మాత్రం చేర్చుకునేందు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని బహిరంగంగానే అంటున్నారు.
ఇప్పటికే బీజేపీలోకి బాబుగారి భక్తులు వెళ్లిన విషయం తెలిసిందే. మరికొందరు కూడా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీంతో వలసలను ఆపేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా స్నేహగీతిక ఆలపిస్తున్నారని పలువురు నాయకులు అంటున్నారు. మరోవైపు.. వైసీపీ కూడా టీడీపీని మరింతగా తొక్కేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే.. ఆ పార్టీ నేతలను చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని తెలుగుతమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి మరి.