- జెసిండా ఆర్డెర్న్ రాజీనామాతో న్యూజిలాండ్ ప్రధాని పోస్టు ఖాళీ అయింది. అయితే తదుపరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌కు కొత్త ప్రధాన మంత్రిగా.. ఆ దేశ విద్యాశాఖ మంత్రి క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక కానున్నారు. జెసిండా స్థానంలో పోటీలో క్రిస్ ఒక్కరే ఉండటం వల్ల ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికోసం తన లేబర్ పార్టీలోని సభ్యులతో ఆమోదం పొందాలి. పోటీలో ఒక్కరే ఉండటం వల్ల సభ్యుల ఆమోదం పొందడం ఇక లాంఛనమైంది.
ఆ స్థానానికి పోటీ పడేందుకు పార్టీలో సరైన అభ్యర్థులు లేకపోవడం వల్ల.. చట్ట సభ్యులు హిప్కిన్స్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కాగా, సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిప్కిన్స్కు దాదాపు 8 నెలల సమయం ఉంది. తన ప్రత్యర్థి కన్జర్వేటివ్ పార్టీ కంటే లేబర్ పార్టీ వెనుకంజలో ఉందని ఓపీనియన్ సర్వేలు వెల్లడిస్తున్నారు. ఈ తరుణంలో లేబర్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత హిప్కిన్స్పై ఉంది.