వాహనదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు లేకుండా.. ప్రయాణించిన దూరానికే టోల్ ఫీజు వసూల్ చేసేలా నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులపై టోల్ ఫీజు వసూలుకు జీపీఎస్- ఆధారిత వ్యవస్థను ఆరు నెలల్లో తీసుకొస్తామని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానే వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు.
ప్రస్తుతం టోల్ ఫీజు వసూళ్ల ద్వారా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు ఏటా రూ.40వేల కోట్లు ఆదాయం వస్తోందని నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే రెండు మూడేళ్లలో ఈ మొత్తం రూ.1.40 లక్షల కోట్లకు పెరగనుందని అంచనా వేశారు. వాహనం ఆగకుండానే నంబర్ ప్లేట్లను రీడ్ చేసే ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం రవాణా శాఖ పనిచేస్తోంది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సగటున 47 సెకన్లు వేచి ఉండాల్సి వస్తోందని.. ఇప్పటికీ నగర శివార్లలో ముఖ్యంగా రద్దీ సమయాల్లో వేచి ఉండే సమయం మరింత ఎక్కువ ఉంటోందని కేంద్ర మంత్రి వివరించారు.