సినీ రాజకీయ యావనిక పై ఎన్టీఆర్..!

-

ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను రాజకీయంగా విభేదించే వారు కూడా.. తెలుగు జాతికి గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తిగా ఎన్టీఆర్‌ను అభిమానిస్తారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ప్రజా జీవితంలోకి వచ్చి తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో చరిత్ర సృష్టించారు. నటుడిగానే కాకుండా, రాజకీయ నాయకుడిగా కూడా సామాన్య ప్రజానీకం మీద అంత ప్రభావం చూపిన వ్యక్తి తెలుగునాడులో మరొకరు లేరు..

నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం అంతా కలిపితే పద్నాలుగేళ్లు కూడా ఉండదు. అంత తక్కువ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వాళ్లు మరొకరు లేరు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అయినా, తెలుగుదేశం పార్టీకి గట్టి సిద్ధాంత పునాది కల్పించారు. ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంలో అనేక అబ్బురపరిచే అంశాలున్నాయి. అరవై ఏళ్ల వయసులో రాజకీయరంగ ప్రవేశమొక్కటే విశేషం కాదు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న ఆయన రికార్డును అన్నాడీఎంకే నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ వరకు ఇంతవరకు ఎవరూ అధిగమించలేదు. ఉత్తర భారతంలో విస్తృతంగా పర్యటించి, హరియాణా నుంచి అసోం వరకు జనాన్ని ఉర్రూతలూగించిన దక్షిణాదికి చెందిన ఏకైక నాయకుడు ఎన్టీఆరే.

వెండితెరపై అందాల రాముడైనా ..కొంటె కృష్ణుడైనా ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతూ ఉండగానే యన్ఠీఆర్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘సమ్రాట్ అశోక’, ‘మేజర్ చంద్రకాంత్’, ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ లాంటి చారిత్రక ,పౌరాణిక చిత్రాలు తీసి తనకు తానే సాటి అనిపించుకున్నారు.

ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడైనా జాతీయ ప్రత్యామ్నాయం కోసం అహర్నిశలూ కృషి చేశారు. కాషాయ వస్త్రాలను ధరించినా లౌకికవాదాన్ని బలంగా నమ్మారు. వచ్చినా, జాతీయవాదిగా నిలబడ్డారు. సంక్షేమ పథకాలకు మారుపేరుగా నిలిచినా, ప్రైవేటు రంగ ప్రాధాన్యాన్ని గుర్తించారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే కమ్యూనిస్టులు, భాజపా నేతలను ఒకతాటి మీదకు తీసుకువచ్చారు. పాలనావ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చారు. రాజకీయాన్ని వృత్తిగా కాకుండా లక్ష్యసాధనకు మార్గంగా పరిగణించారు. రాజకీయ పదవులను తృణప్రాయంగా చూశారు…

రాజకీయ ప్రవేశంలోనూ యన్టీఆర్‌ రైతులకు పెద్ద పీట వేశారు. ఆయన అధికారంలోకి రాగానే రైతులకు వాగ్దానం చేసిన అనేక అంశాలనూ అమలు చేశారు. రైతాంగానికి ఎంతో మేలు చేసిన ‘సింగిల్‌ విండో విధానం’, పట్టాదారు పాసుపుస్తకాల వ్యవస్థ, మండల వ్యవస్థ, హార్స్‌ పవర్‌ రూ. 50కే విధానం ద్వారా ఉచిత కరెంట్‌ సరఫరా వంటి విప్లవాత్మక రైతు అనుకూల విధానాలన్నీ దేశం మొత్తంలోనూ మొదటగా ఒక్క యన్టీఆరే ప్రారంభించారు. సహకార బ్యాంకింగ్‌ రంగంలో యన్టీఆర్‌ కాలం స్వర్ణయుగం. యన్టీఆర్‌ రైతు సంక్షేమం కోసం అనుసరించిన ఈ విధానాలనే తరువాత దేశమంతటా అనుసరించారు. రైతు కుటుంబం నేపథ్యంలో ఉన్న చిత్రాలలోనే నటించడమే కాదు కొన్ని సినిమాల్లో అదే పనిగా రైతుల సంక్షేమం కోసం కథలు రూపొందించిన సందర్భాలూ ఉన్నాయి.

ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఇతర రాష్ట్రాల వారికి, భాషల వారికి వ్యతిరేకం కాదు. ఎన్నడూ మరొక భాషను, ప్రజా సమూహాన్ని వేలెత్తి చూపలేదు. దూషించలేదు. కాంగ్రెస్‌ ఢిల్లీ నాయకత్వం మీదే ఆయన తన విమర్శలు గురిపెట్టారు. అందుకే తెలుగు భాషాసంస్కృతులకు అంతర్జాతీయ ప్రాభవం తీసుకొచ్చిన ఆయనను తెలుగు జాతి ఎన్నటికీ మరువలేదు.

Read more RELATED
Recommended to you

Latest news