రెండు రోజుల పర్యటన కోసం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట
ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. త్వరలో ఒడిశాలో ‘మేక్ ఇన్ ఒడిశా’ కాన్‌క్లేవ్ మూడో ఎడిషన్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీఎం నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో సమావేశం కానున్నారు. హోటల్ తాజ్‌కృష్ణలో పెట్టుబడిదారులతో సమావేశమై పెట్టుబడులపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. తన 76వ బర్త్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు ఒడిశా ముఖ్యమంత్రి.
అంతేకాదు, రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్ట్ నియామకాలు ఉండబోవని ఒడిశా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ఒడిశా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం వివరించారు. ఇందుకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రతి సంవత్సరం ఖజానాపై అదనంగా రూ.1300 కోట్ల భారం పడనుంది.