ప్రపంచ దేశాలను ఓమిక్రాన్ అతలాకుతలం చేస్తోంది. దక్షిణాఫ్రికాకే పరిమితమైన ఓమిక్రాన్ తక్కువ వ్యవధిలోనే ప్రపంచంలోని 29 దేశాలకు పాకింది. తాజాగా ఈ జాబితాలో భారతదేశం కూడా చేరింది. ఇప్పటి వరకు ఇండియాలో 02 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి బెంగళూర్ కు వచ్చిన ఇద్దరిలో ఈ వేరియంట్ వైరస్ ను కనుక్కున్నారు. దీంతో ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.
తాజాగా ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో కరోనా పరిస్థితులు.. ఓమిక్రాన్ కేసులపై అధికారులు ప్రధాని మోదీకి వివరించనున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగంగా చేసేలా అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర హెల్త్ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వచ్చిన ఇద్దరి కాంటాక్ట్ ట్రేసింగ్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. అయితే వీరెంతమందిని కలిశారో తెలిస్తే.. మరిన్ని ఓమిక్రాన్ చైన్ ను కట్టడి చేసే అవకాశం ఉంది.