భారత్ లో మరో రెండు ఓమిక్రాన్ కేసులు… దేశంలో145 కుపెరిగిన కేసుల సంఖ్య

దేశంలో చాపకింద నీరులా ఓమిక్రాన్ కేసులు విస్తరిస్తున్నాయి. రోజురోజుకు కొత్త ప్రాంతాలకు ఓమిక్రాన్ విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు ఓమిక్రాన్ కేసులు ఇండియాలో నమోదయ్యాయి. గుజరాత్ లో కొత్తగా రెండు ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన ఇద్దరిలో ఓమిక్రాన్ వైరస్ ను గుర్తించారు. తక్కువ వ్యవధిలోనే ఓమిక్రాన్ కేసులు వేగం పెరగడం.. అందరిని కలవరపరుస్తోంది. గత మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య ఇండియాలో డబుల్ అయింది. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇండియాలో ప్రస్తుతం 145 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా ఉన్న కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్ర (48), ఢిల్లీ (22), రాజస్థాన్ (17) మరియు కర్ణాటక (14), తెలంగాణ (20), గుజరాత్ (9), కేరళ (11), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1) )  పశ్చిమ బెంగాల్ (1) ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇండియాలో నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చినవారికే వచ్చాయి. ముఖ్యంగా యూకే, దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న వారిలో ఎక్కువగా ఓమిక్రాన్ కేసులు నమోదదయ్యాయి. వీరితో పాటు టాంజానియా, సోమాలియా,  కెన్యా, జింబాబ్వే దేశాల నుంచి వచ్చిన వారికి ఓమిక్రాన్ సోకింది.