బలగం మొగిలయ్య కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు. ఆయనని ఆదుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో బలగం మొగిలయ్యకు నిమ్స్ లో చికిత్స కొనసాగుతోంది. నిత్య పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు నిమ్స్ వైద్యులు.
దీర్ఘకాలంగా డయాబెటిస్, బీపీ సమస్యలతో బాధపడుతున్నారు మొగిలయ్య. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఏడాది నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు మొగిలయ్య. మంగళవారం ఛాతి నొప్పి రావడంతో వరంగల్ నుంచి నిమ్స్ కు తరలించారు వైద్యాధికారులు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత గుండె సమస్య లేదని నిర్ధారించారు నిమ్స్ వైద్యలు. ప్రస్తుతం డయాలసిస్ కొనసాగిస్తూ, చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని వెళ్లడించారు నిమ్స్ వైద్యులు.