అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మొన్ని మొన్న ఓ సూపర్ మార్కెట్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడగా.. ఇటీవల టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో విచక్షణారహితంగా చిన్నారులపై మరో దుండగుడు కాల్పులు జరిపిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఓక్లహామాలోని తుల్సా నగరంలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ దవాఖాన ప్రాంగణంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు.
నలుగురిని కాల్చిన తర్వాత అతడు కూడా కాల్చుకుని చనిపోయాడని వెల్లడించారు. అతడు ఎవరేనిది గుర్తించాల్సి ఉన్నదని తుల్సా పోలీస్ డిప్యూటీ చీఫ్ జొనాథన్ బ్రూక్స్ తెలిపారు. నిందితుని వద్ద రైఫిల్, హ్యాండ్‌గన్ ఉన్నాయని చెప్పారు. అమెరికాలో మే నెలలో రెండు భారీ కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. గత వారం టెక్సాస్ రాష్ట్రం ఉవాల్డాలోని ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో 19 విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు. ఇక మే మొదటి వారంలో న్యూయార్క్‌లోని బఫాలో నగరంలో ఉన్న సూపర్‌మార్కెట్‌లో దుండగుడు కాల్పులు జరిగింది. దీంతో పది మంది మృతిచెందారు.