’ఆపరేషన్ దేవీ శక్తి‘ సక్సెస్… ఆప్గనిస్తాన్ నుంచి 104 మందిని ఇండియాకు

ఆగస్టు నుంచి తాలిబన్ చెరలో చిక్కుకున్న ఆప్ఘనిస్తాన్ నుంచి భారతీయులను, హిందు-సిక్కు మైనారిటీలను విజయవంతంగా ఇండియాకు తీసుకువస్తోంది విదేశంగా శాఖ, భారత ప్రభుత్వం. తాజాగా మరో 104 మందిని ’ఆపరేషన్ దేవీ శక్తి‘ ద్వారా ఇండియాకు చేర్చారు. కామ్ ఎయిర్ ఫ్లైట్ ద్వారా కాబూల్ నుంచి ఢిల్లీ వచ్చిన ప్రత్యేక విమానంలో వీరిని తరలించారు. ఇలా వచ్చిన వారిలో 10 మంది ఇండియన్స్ కాగా 94 మంది ఆప్గాన్ హిందు సిక్కు మైనారిటీలు ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. తరలించిన వారిలో 3 మంది శిశువులతో సహా 9 మంది పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు.  ప్రయాణికులతో పాటు.. గురు గ్రంథ్ సాహిబ్ రచనలు, మూడు కాపీల హిందూ మత గ్రంథాలను కూడా తీసుకొచ్చింది కేంద్రం.

గత ఆగస్టులో ఆప్ఘాన్ లో పౌర ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి అక్కడ మైనారిటీల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను, మైనారిటీలను భారత ప్రభుత్వం విజయవంతంగా స్వదేశానికి తీసుకువస్తోంది. ఇప్పటి వరకు ఇలా 565 మందిని ఇండియాకు తరలించారు. ప్రస్తుతం కాబూల్ నుంచి వచ్చిన విమానం తిరుగు ప్రయాణంలో వైద్య సామాగ్రితో పాటు భారత్​లో చిక్కుకుపోయిన 90 మంది అఫ్గాన్ పౌరులను తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.