ఒన్ టైం సెటిల్మెంట్ పేరిట ఆ మధ్య గృహ నిర్మాణ లబ్ధిదారుల విషయమై ఆంధ్రాలో పెద్ద చర్చే జరిగింది. ఈ వివాదాన్ని టీడీపీ తనకు అనుగుణంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది కూడా!లబ్ధిదారులెవ్వరకూ ఓటీఎస్ చెల్లించనవసరం లేనేలేదని కూడా తేల్చి చెబుతూ పసుపు పార్టీ గ్రామాల్లో ప్రచారం నిర్వహించింది కూడా! అయితే ఆ వివాదం సంగతి ఎలా ఉన్నా తాజాగా ఏపీ సర్కారు మరోనిర్ణయం తీసుకుంది.
గృహ నిర్మాణ శాఖ నుంచి లోన్లు రూపంలో తీసుకున్న మొత్తాలను తిరిగి చెల్లించేందుకు మరో ఉపాయం ఆలోచించింది. డ్వాక్రా గ్రూపుల నుంచి రుణాలు తీసుకుని ఓటీఎస్ కు చెల్లించాలని సూచనలు చేస్తోంది. ఈ మేరకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు సైతం జారీ చేసింది. ఇందుకు సంబంధించి బ్యాంకు ద్వారా లింకేజీ రుణం పొందడం కానీ లేదా పొదుపు సంఘం ద్వారా రుణం పొందడం కానీ చేయవచ్చు అని లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పొదుపు సంఘం ద్వారా అయితే 11శాతం వడ్డీ, అదే లింకేజీ రుణం ద్వారా అయితే 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అని వివరిస్తున్నారు.