ఏపీ రాజకీయాలు ఢిల్లీతో ముడిపడినట్లు కనిపిస్తున్నాయి. వరుసపెట్టి రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్ళడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. ఇటీవలే సిఎం జగన్ వరుసగా రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలని కలిసి వచ్చారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఢిల్లీకి వెళ్లారని వైసీపీ చెబుతుంది..కానీ ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారనే ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు.
ఇదే సమయంలో వివేకా హత్య కేసులో తన తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా బిజేపి పెద్దలని కలిసి మాట్లాడారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వీటిల్లో ఏది నిజముందో ఎవరికి తెలియదు. కానీ రాజకీయంగా ఢిల్లీ పెద్దలతో జగన్‌కు సఖ్యత ఉన్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం రాజకీయాలు వేరుగా ఉన్నాయి. ఇదే తరుణంలో బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్..తాజాగా ఢిల్లీకి వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ వెళ్ళి వచ్చిన తర్వాత పవన్ ఢిల్లీ టూరు పెట్టుకున్నారు. ఆయన అమిత్ షా, జేపి నడ్డాలతో భేటీ కానున్నారు.
అయితే ఇప్పటికే ఏపీలో జనసేన, బిజేపి పొత్తుకు బీటలు పడ్డాయి..మరి ఇలాంటి సమయంలో పవన్ ఢిల్లీకి వెళ్ళి కమలం పెద్దలతో ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇటు తాజాగా బిజేపికి చెందిన సుజనా చౌదరీ..టిడిపి నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆయన దేని గురించి మాట్లాడారనేది క్లారిటీ లేదు.
ఇలా ఏపీలో ప్రతి పార్టీ బిజేపి చుట్టూనే తిరుగుతుంది. అంటే కేంద్రం ఆశీస్సులు ఎవరికుంటే..రాష్ట్రంలో వారికి మళ్ళీ అధికారం దక్కుతుందనే ప్రచారం ఉంది. చూడాలి మరి చివరికి కేంద్రంలోని బిజేపి ఎవరికి మద్ధతుగా నిలుస్తుందో.