వాలంటీర్స్… మీకు తెలియకుండానే మీతో తప్పు చేయిస్తున్నారు : పవన్‌

-

మానవ అక్రమ రవాణాకు వలంటీర్లు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించడం, దానిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ.. వెనక్కి తగ్గలేదు. మలిదశ వారాహి యాత్ర సందర్భంగా ఇదివరకు ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వాలంటీర్లను తప్పుపట్టారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపడం తెలిసిందే. ఇప్పటికీ వైసీపీ మంత్రులు పవన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో, తణుకు సభలో వాలంటీర్ల అంశాన్ని పవన్ కల్యాణ్ మరోసారి ప్రస్తావించారు.

శివశ్రీ అనే వాలంటీర్ కన్నీళ్లు తమ జనవాణి కార్యక్రమానికి నాంది అని వెల్లడించారు. తానేమీ వాలంటీర్ల కడుపుకొట్టే వ్యక్తిని కానని, రూ.5 వేలకు ఇంకో రూ.5 వేలు కలిపి ఇచ్చే వ్యక్తినని చెప్పుకొచ్చారు.

“వాలంటీర్స్… మీరు జగన్ వలన చాలా ఇబ్బంది పడతారు. మీకు తెలియకుండానే మీతో తప్పు చేయిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒత్తిడికి లొంగి తప్పు చేశారు…. దాని ఫలితంగా జైలుకెళ్లారు. ఇప్పుడు కూడా మీతో అలాగే తప్పు చేయిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంలో ఒక శాఖ నుంచి మరో శాఖకు డేటా బదిలీ అవ్వాలంటే లిఖితపూర్వక ఉత్తర్వులు ఉంటాయని, మరి వాలంటీర్ల నుంచి డేటా పంపించడానికి ఏ లిఖితపూర్వక అనుమతి ఉందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. “గుర్తుంచుకోండి వాలంటీర్లూ… రూ.164 రోజువారీ జీతంతో మీతో తప్పు చేయిస్తున్నారు. మీరు చేసే తప్పుకు బలయ్యేది మీరే” అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news